శ్రీశైల స్థలపురాణము 
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్ధించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతి ని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాక లో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

             శ్రీశైలానికి  సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము,  మొదలైన నామాలుండేవి. శ్రీ అనగా సంపద, శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో వ్యవహారం వుండడమూ కలదు. క్రీ.శ.1313లోని ఒక శాశనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరూ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ శాసనములో మహేశ్వరులు శ్రీకైలాసము (శ్రీశైలం) పైన నివసించారని ఉంది.

మైసిగండి మైసమ్మ
ఈ ఆలయం మైసిగండికి వెళ్లేదారిలో శ్రీశైలం జాతీయ రహదారిపై చిన్నగ్రామంలో ఉంది. పెద్దవిగ్రహం ఉన్న ఈ ఆలయం మహాకాళి గ్రామదేవతగా పూజలందుకొంటోంది.

ఉమామహేశ్వరం

ఇది శ్రీశైలానికి ఉత్తరద్వారం. రోడ్డు మార్గం నుండి 12 కి.మీ. లోనికి వెళితే దట్టమైన అటవీప్రాంతంలో ఉమామహేశ్వర శివాలయం కనిపిస్తుంది.

మన్ననూరు పక్షుల అభయారణ్యం

చెక్‌పోస్టు దగ్గర మన్ననూరు అటవీ ప్రాంతంలో నల్లమల అడవుల్లోని వివిధ రకాల పక్షులను మనం ఈ అభయారణ్యంలో చూడవచ్చు.

మల్లెలతీర్థం

శ్రీశైలానికి 60 కి.మీ. ముందుగా వట్టి వెల్లుపల్లి గ్రామం నుండి మట్టిరోడ్డుపై 7కి.మీ. వెళితే మల్లెల తీర్థం వస్తుంది. ఇది చూడచక్కని తీర్థం.

శ్రీశైలం డ్యాం

కృష్ణానదిపై నిర్మించిన ఈ డ్యాం 791 మీ. ఎత్తు కలిగి 12 గేట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కర్నూలు, కడప జిల్లాలకు ఈ డ్యాం నీరు అందిస్తుంది. డ్యాం కు రెండువైపులా ప్రకృతి దృశ్యాలు మనసుని దోచేస్తాయి.

పాతాళగంగ

ప్రధాన ఆలయానికి 1 కి.మీ. దూరంలో కృష్ణానది పాతాళగంగగా ప్రవహిస్తుంది. 500 మెట్లు దిగి ఇక్కడకు చేరాలి. ప్రస్తుతం ఇక్కడ రోప్‌వే అందుబాటులో ఉండటం వలన సులభంగా ఇక్కడకు చేరుకోవచ్చు. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలను చేస్తారు.

శిఖర దర్శనం

''శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే" అంటే ఇక్కడ నుండి శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే సర్వ పాపాలూ ప్రక్షాళనమై పునర్జన్మరహిత మోక్షం లభిస్తుందని చెబుతారు. ఎత్తైనకొండపై ఆలయానికి 8 కి.మీ. దూరంలో ఉంది ఈ శిఖరం.

హటకేశ్వరం

దీనినే అటకేశ్వరం మరియు అటికేశ్వరం అని కూడా అంటారు. శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు శివుడు అటికలో (కుండపెంకులో) బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే హటకేశ్వరం. ఇది శ్రీశైలానికి 3 కి.మీ దూరంలో ఉంది. స్వామివారి పేరు హటకేశ్వరుడు. హటకం అంటే బంగారమని అర్థం. మేరు పర్వతాన్ని ఆయుధంగా త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించాడు. బంగారు లింగం ఆకారంలో శివుని పూజిస్తారు. కనుక హటకేశ్వరుడనే పేరు ఏర్పడింది. ఆలయంముందు హటకేశ్వరతీర్థం ఉంది.

పాలధార, పంచధార

హటకేశ్వరానికి దగ్గరలో పాలధార నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. శివుని శిరస్సు నుండి ఈ ధార ఉద్భవించిందని ప్రతీతి. హటకేశ్వరం వద్ద పక్కపక్కగా పాలధార, పంచధార ప్రవహిస్తూ కనిపిస్తాయి. అత్యంత మనోహర ప్రదేశం ఇది. శివుని ఐదు ముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పేరుగల పంచ ముఖాలనుండి ఈ పంచధార ఉద్భవించింది కనుక దీనిని పంచ (ఐదు) ధారగా పిలుస్తారు. ఇక్కడి జలాన్ని సేవించి స్నానంచేస్తే అన్ని కోరికలూ సిద్ధిస్తాయని చెబుతారు. ఇక్కడే జగద్గురువులైన ఆది శంకరులు తపస్సు చేశారని, 'శివానందలహరి , 'సౌందర్యలహరి అనే సుప్రసిద్ధ గ్రంథాలను వారు ఇక్కడే రచించినట్టుగా చెబుతారు. ఇది దివ్యమైన సుందర పవిత్ర ప్రదేశం.

భీముని కొలను

పాలధార, పంచధారలకు ఎదురుగా 8 కి.మీ. మట్టిమార్గం గుండా ప్రయాణిస్తే ఈ కొలనును చేరుకోవచ్చు.  ఇక్కడ శివాలయం ఉంది. ఔషధ విలువలు అపారంగా ఉన్న ఈ కొలనులో స్నానం చేస్తే ఆరోగ్యం లభిస్తుంది. ఇక్కడి పర్వత శిఖరాలు, శిలలు అతి ప్రాచీనమైనవని పురావస్తు శాఖవారు కనుగొన్నారు. ఈ ప్రాంతం గురించిన పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది. పంచ పాండవులు ద్రౌపదితో కలిసి ఈ నల్లమల అడవుల్లో వెళుతుండగా ద్రౌపదికి దాహం వేసిందట. భీముడు తన గదతో ఇక్కడి పర్వతాన్ని బలంగా మోదగా ఆ పర్వతం రెండు ముక్కలుగా చీలి నీరు ఉద్భవించింది. సంత సించిన భీముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే భీమలింగంగా పేరుగాంచింది. ఇటీవల ఇక్కడ భీముని చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భీముని కొలను గురించిన ప్రస్తావన స్కాందపురాణంలో శ్రీశైలఖండంలో పేర్కొనబడింది. అడవుల్లో ఉన్న ఈ ప్రదేశానికి మొదట్లో మార్గం అనేదిలేదు. 14వ శతాబ్దంలో రెడ్డిరాజులు యాత్రికుల సౌకర్యార్థం మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. వింతగా కనిపించే ఈ జలధార, పచ్చని చెట్ల సమూహాలతో నిండిన ఈ ప్రశాంత కుండం చూపరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

సాక్షిగణపతి

హటకేశ్వరానికి దగ్గరలోని ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అక్కడి చిట్టాలో తమపేరు రాస్తారు. గణపతి శ్రీశైలానికి వచ్చే యాత్రికు లకు సాక్షిగా ఉంటాడు కనుక సాక్షిగణపతిగా పిలుస్తారు. పరమ పావనమైన ప్రఖ్యాతి గలిగిన దివ్య ప్రదేశ మైన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ప్రధానమైనది. ఇక్కడి భ్రమరాంబా దేవి ఆలయం 108 శక్తిపీఠాలలో ఒకటి. కృతయుగం లో హిరణ్యక శిపుడు,  త్రేతా యుగంలో శ్రీరాముడు,  ద్వాపర యుగంలో పాండవులు ఈ ఆలయాన్ని దర్శించారని చెబుతారు. పతంజలి మహర్షికంటే ముందు యోగశాస్త్రాన్ని బోధించిన గోరఖ్‌నాధుడు, ఆదిశం కరులు, ఆచార్య నాగార్జునుడు శ్రీశైలాన్ని దర్శించారని కొంతకాలం తపమాచరించారని తెలుస్తుంది.

వృద్ధమల్లిఖార్జునుడు

ఇప్పటి శ్రీశైల మల్లిఖార్జున ఆలయం కంటే వృద్ధ మల్లిఖార్జున ఆలయం ప్రాచీనమైన ఆలయం. ఇక్కడ నంది ఉండదు.  కృష్ణానది అడుగు పొరల్లో సరస్వతీనది ప్రవహిస్తుంది. కృష్ణానదికి అంతర్వాహినిగా ఈ సరస్వతీనది ప్రవహించటం వలన అంతర్వాహినిగా పిలుస్తారు. మల్లిఖార్జున ఆలయ శిఖరం నీడ ఈ గుండంలో ప్రతి ఫలిస్తుంది. జువ్వి, రావి, మేడి వృక్షాలు పెనవేసుకుని ఒకే వృక్షంగా కనిపిస్తుంది. సంతానం లేనివారు ఈ వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానభాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి