భద్రాచలం

      పరమ పవిత్రమైన గౌతమి నదీ తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామి వారి కృపకు పాత్రులవుతారు. శ్రీ రామ నామం జపించినంతనే ముక్తిమార్గం కలుగుతుంది. ఇక్కడ స్వామివారు సీతా లక్ష్మణ సమేతుడై  చతుర్భుజుడుగా వెలిసారు. ఇంకొక  ప్రత్యేకత ఎమిటంటె స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి, దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుండటం. ఈ క్షేత్రం ఎంతో ప్రాచినమైనది. దీని గురించి బ్రహ్మండపురాణంలోనూ, గౌతమీ మహత్స్యంలోనూ ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతంలోనే త్రేతాయుగము  నందు శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం చేసాడని ప్రతీతి. ఒకసారి స్ధల పురాణం పరిశిలిస్తే....  శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తర్వాత ఆబండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని అపుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట. దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయసాగాడు. దీనితో బద్రున్ని అనుగ్రహించి భద్రగిరిపై వెలసి ఒక పుట్టలో ఉన్నాడట. కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో రామునికి పరమ భక్తురాలుగా ఉంటూ ఎపుడూ రామనామ స్మరణ చేస్తుందేది. ఒక రోజు కలలో రాముడు నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను నాకు ఎదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట. దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలోవెళ్ళి చూడగా పుట్టలో వేంచేసి ఉన్నాడట. పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకు చేతనయినట్టు ఒక పందిరి వేసి విగ్రహలను ఉంచి పూజలు చేస్తుండెనట. భద్రారెడ్డి పాలెంకు కూతవేటుదూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న, కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న, చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు. గోపన్నకు యుక్త వయస్సురాగానే తనకుదగ్గర బందువు అయిన అక్కన్న తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండటంతో గోపన్నను పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగానియమించాడు. ఆ పరగణాలోనే ఉన్న భద్రగిరి ప్రాంతము  ను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి, పన్నులుగా వసూలయిన ధనంతో రామాలయం ను సర్వాంగసుందరంగా నిర్మించాడట. దీనితో కొపోద్రిక్తుడైన తానిషా గోపన్నను చరసాలలో భందించి చిత్రహింసలకు గురి చేస్తాడు. తానిషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామ మాడలను చెల్లించాడట. తానిషా ఒక్కసారిగా మేలుకుని చూడగా ఆలయానికి గోపన్న ఎంతయితే వాడాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉందట. అంతట తానీషా తన తప్పును తెలుసుకుని గోపన్నను ఖైదునుండి విడుదల చేసాడట. గోపన్న ఎపుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు. 
      భద్రాచలంలోని స్వామివారి ఆలయాన్ని ఉదయం 4.30 నుండి రాత్రి 9.00గంటల వరకూ తెరచి ఉంచుతారు. 

భద్రాచలంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు, పండుగలు 
శ్రీరామనవమి 
      స్వామివారి ఆలయంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్రశుద్ద నవమి నాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు. ఇప్పటికీ  ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తున్నారు. తానిషా ప్రభువు శ్రీరామచంద్రుని యొక్క లీలలు కళ్ళారా చూసినప్పటి నుండి పరవశించి ప్రతీ యేటా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి, అప్పటి తానిషా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారం ముత్యాల తలంబ్రాలు సమర్పించేవాడట. ఈ ఆనవాయితి ఇప్పటికి కూడా జరుగుతుంది కాక పోతే ఇప్పుడు  రాష్ట్రప్రభుత్వం నుండి స్వామి వారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలను స్వయముగా రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేస్తారు. సీతారాముల కళ్యాణమహోత్సవం చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుండే కాక వివిధరాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు.

వైకుంఠ ఏకాదశి 
      శ్రీమహవిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశిని ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఏకాదశికి గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం, ఉదయం 5గంటలకు జరిగే వైకుంఠద్వార దర్శనం చూసేవారికి ఎంతో నయనానందకరంగా ఉంటాయి. 

వాగ్గేయకారమహోత్సవం 
       భక్తరామదాసు పేర 1972 సంవత్సరమునుండి వాగ్గేయకార మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.

వివిధ మార్గాల ద్వారా భద్రాచలం ఇలా చేరుకోవచ్చు. . . 
రోడ్డు మార్గము ద్వారా . . . 
          బస్సులో భద్రాచలం చేరుకోవాలనుకొనే వారికి, 27 కి.మీ దూరములో పాల్వంచ, 35 కి.మీ దూరములో మణుగూరు, 40 కి.మీ దూరములో కొత్తగూడెం, 105 కి.మీ దూరములో భద్రాచలం పట్టణ జిల్లా కేంద్రమైన ఖమ్మం ఉన్నాయి. దాదాపు ప్రతీ జిల్లా కేంద్రము  నుండి ఆర్.టి.సి బస్సు సౌకర్యం కలదు. 

రైలు మార్గము ద్వారా . . . 
      రైలులో భద్రాచలం చేరుకోవాలనుకొనే వారికి, 35 కి.మీ దూరములో భద్రాచలం రోడ్డు అను రైల్వే స్టేషన్,  42 కి.మీ దూరములో  కొత్తగుడెం రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

వాయు మార్గము ద్వారా . . . 
       విమానంలో భద్రాచలం చేరుకోవాలనుకొనే వారికి, 160 కి.మీ దూరములో రాజమండ్రి విమానాశ్రయము, 200 కి.మీ దూరములో విజయవాడ విమానాశ్రయము, 312 కి.మీ దూరములో హైదరాబాదు విమానాశ్రయము ఉన్నాయి.

జల మార్గము ద్వారా . . .  
      భద్రాచలానికి జలమార్గం ద్వార కూడా చేరుకోవచ్చు. రాజమండ్రి నుండి గోదావరి నది ద్వారా లాంచి సౌకర్యం కలదు. 

ఎక్కడ ఉండాలి 
      భద్రాచలంలో అన్నిరకాల ప్రజలకువారి వారి స్తోమత మేరకు వసతి సౌకర్యము కలదు. ప్రభుత్వ సత్రాలు, కుటీరాలు, అతిధి గృహాలు, భోజనాలయములు ఇంకా వివిధ సత్రాలు కలవు. 

వాటి వివరాలు కింది విదంగా ఉన్నాయి. . . 
సాదారణ గదులు
చంద్రమౌళి సదనం 
నాగిరెడ్డి సదనం 
యాత్రిక సదనం 
యాదగిరి సదనం 
వేములవాడ సదనం 

శీతల గదులు 
గోల్డ్ స్టార్ 
అల్లూరి నిలయం 
నంది నిలయం 
బ్రహ్మాజి కాటేజీ 
సీతా నిలయం

భద్రాచలంలో చూడవలసిన ఇతర ఆలయాలు
గోవిందరాజులస్వామి ఆలయం 
నరసింహ స్వామి ఆలయం 
యోగానంద నరసింహ స్వామి ఆలయం 
శ్రీరామదాసు ద్యానమందిరం 
రంగనాయక స్వామి ఆలయం 
వేణుగోపాలస్వామి ఆలయం 
హరనాద ఆలయం 
      ఇంకా భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది. రాముడు వనవాస సమయంలో ఇక్కడే ఉన్నాడట. ఈ ప్రాంతమంతా ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంటూ భక్తులను ఆహ్లదపరుస్తుంది. ఈ పర్ణశాలలో వనవాస సమయంలో జరిగిన సన్నివేశాలు శిలా రూపంలో మనకు కనిపిస్తాయి. పక్కనే వేణు గోపాలస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడే ఒక వాగు గోదావరి నదిలో ఐఖ్యమవుతుంది. ఈ వాగు గట్టుమీదే సీతమ్మవారు స్నానంచేసి తన నార చీరలను ఆరేసుకునేదట.అందుకే ఈ వాగును సీతమ్మవాగు అని అంటారు. విశేషమేమిటంటే ఇప్పటికి ఆవిడ ఆరేసిన ప్రాంతంలో చీర గుర్తులు 20 అడుగుల మేర కనిపిస్తాయి అక్కడ. ఇంకా అమ్మవారు కుంకుమకు ఉపయోగించిన రాళ్ళను కుడా అక్కడ చూడవచ్చు. 

పర్ణశాల దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు. . .  
యటపాక 
      ఈ ప్రాంతంలోనే రావణాసురుడుతో జటాయివు పోరాడి సీతాదేవి యొక్క సమాచారం శ్రీరాముడికి చేరవేసి మరణిచాడట.ఇక్కడ రామున్ని కులాసరాముడు అంటారు. 

రధగుట్ట 
      ఈ గుట్ట మిదే సీతాదేవిని అపహరించడానికి వచ్చిన రావణుడు రధమును నిలిపాడట. 

దుమ్ముగుడెం 
      ఇక్కడ రాముడు రాక్షసులను చంపి దహనకాండ నిర్వహించాడట. వారి చితాభస్మాల ధూలి ఆప్రాంతం అంతా కమ్మి ఉండటంతో దీనికి దుమ్ముగుడెం అని పేరు వచ్చింది అని చెబుతారు. 

గోదావరి నది 
      పర్ణశాల ఒడ్డునే గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక్కడికి వచ్చిన యాత్రికులు గోదావరి నదిని వీక్షించడానికి వీలుగా మర పడవలు ఏర్పాటు చేసియున్నారు. 

గుండాల 
      ఇక్కడ గోదావరి నది ఒడ్డున ఉష్టగుండాలు ఉన్నాయి. ఎక్కడ తవ్వినా వేడినీరు ఉబికి వస్తుంది. దీనికి ఒక కధ ప్రచారంలో ఉంది. వనవాస సమయంలో సీతమ్మవారు స్నానానికి శ్రీరాముడు తన బాణం భూమిలోకి వెయ్యగానే వేడి నీరు ఉబికి వచ్చిందట. అవే ఇప్పుడు ఉష్ణగుండాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి