వాస్తుని మనం ఎందుకు నమ్మాలి?

        పంచాంగము, జ్యోతిష్యము, వాస్తు మొదలగు వాటిలో మా తండ్రి గారికి కొంత వరకు ప్రవేశము ఉండేది. కానీ వాటిపై నాకస్సలు నమ్మకము ఉండేది కాదు. నేను ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము చదివేటప్పుడు(సం 1981లో) ఒక రోజు అనుకోకుండా మా ఇంటికి వచ్చిన నా మిత్రుని చేతిని మానాన్న గారు పరిశీలించడము జరిగినది. తరువాత రోజు మా తండ్రిగారు నాతో నువ్వెలాగూ నమ్మవు, నీ స్నేహితునికి చక్ర గండము ఉన్నది, అతడిని జాగ్రత్తగా ఉండమని చెప్పు అని అన్నారు, నాకు అర్ధము కాక అంటే ఏమిటి? అని అడిగాను. అతడు ఏదో ఒక చక్రము కారణంగా మరణిస్తాడని అన్నారు. సరేలే అనుకున్నాను, కానీ నమ్మకము లేకనో లేక చెప్పలేకనో నేను వాడికి చెప్పలేక పోయాను. ఆ విషయము మరచికూడా పోయాను. షుమారు ఏడెనిమిది నెలల తరువాత అతను సైకిలుతో పాటు లారీ క్రింద పడి మరణించడము జరిగినది. చాలా బాద పడ్డాను కానీ ఏమీ చేయలేకపోయాను.
         
        ఆ తరువాత మాతండ్రి గారితో నాకు హస్త సాముద్రికము నేర్పించమని అడగడము జరిగినది. అందులకు ఆయన హస్త సాముద్రికము నువ్వు నేర్చుకున్నా ఉపయోగము ఉండదు, ఎందుకంటే ఎవరి చేతినైనా పరిశీలించినపుడు మనకు తెలిసినవి తప్పకుండా వారికి చెప్పాలి, అన్నీ చెప్పలేము అలాగని దాచనూలేము అందుకని  చేతిని చూడడము నేర్చుకోవడముకన్నా వాస్తు శాస్త్రము గూర్చి తెలుసుకుంటే నీకు, నీ చుట్టుప్రక్కలవారికి కొంతయినా ఉపయోగము ఉంటుంది అనిచెప్పారు. ఆ తరువాత ఎప్పుడైనా ఆయనతో కలసి బజారుకి వెళ్ళినప్పుడు, ఈ ఇంట్లో నివసించేవారికి పిల్లలు ఉండరు, ఆ ఇంట్లో నివసించేవారిలో ఎవరో ఒకరు ధీర్ఘ వ్యాధితో బాదపడుతుంటారు, ఇదుగో ఈ వీధికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉన్నవారి దారిద్ర్యము ఇలా వుంటుంది, అని చెప్పేవారు. 
          
        ఆ తరువాత వాకబు చేస్తే మా తండ్రి గారు చెప్పినవి చాలా వరుకు జరిగాయి అని తెలిసేది. అవే కాదు ఇంకా కొన్ని నిదర్శనలు చూపారు.  అలా నాకు తెలియకుండానే నాకు వాస్తు శాస్త్రము తెలుసుకోవాలనే కోరిక బలీయమైనది కానీ ఉన్నత చదువుల రీత్యా నేను మద్రాసుకి వెళ్లిపోవడము, మా తండ్రి గారి ఆరోగ్యము క్షీణించడము జరిగినది. కావున మా తండ్రి గారిని ఏమీ అడగలేకపోయాను. కానీ వీలున్నప్పుడల్లా మా తండ్రి గారి వద్ద ఉండిన  మయ వాస్తు, కృష్ణ వాస్తు మొదలగు శాస్త్రాలు చదువుతుంటే వాటిలోని చాలా అంశాలు నాకు అర్ధమయ్యేవి కావు. కొన్ని అర్ధమయినా ఇవి ఆచరించడానికి వీలవుతాయా? అనిపించేవి. ఉదాహరణకి ఒక్కొక్క వర్ణము వారికి ఒక్కొక్క రకమయిన ఇటుకలు ఉండాలి. మట్టి యొక్క రంగు, రుచి, వాసన చూచి  గృహము నిర్మాణము చేయవలెను. ఇలా...  ఇవి కాక ఇంకా మనకు వీలు కానివి ఎక్కువగా కనిపించేవి. ఆవిషయమే ఒకరోజు మా తండ్రి గారితో ప్రస్తావిస్తే, శ్రీ ముద్రగెడ రామారావు గారు రచించిన రామరాయ వాస్తు శాస్త్రము నాకు ఇచ్చి ఇది చదువు అని అన్నారు. అదీ గ్రాంధిక భాషలోనే ఉన్నా, కొంతవరకు అర్ధము చేసుకోవటానికి, ఆచరించటానికి వీలుగా ఉందనిపించినది. రెండు సార్లు పూర్తిగా చదివాను. అంతలోనే మా తండ్రి గారి పరిచయస్తులు ఒకరు, మా తండ్రి గారి వద్ద ఉన్న కొద్ది గ్రంధాలతో పాటు రామరాయ వాస్తు శాస్త్రమును కూడా తీసుకువెళ్ళడము జరిగినది. ఆ తరువాత (అవి తిరిగి రాలేదు అది వేరే సంగతి) ఎంత ప్రయత్నించినా మరలా నాకు రామరాయ వాస్తు శాస్త్రము దొరకలేదు. తరువాత శ్రీ గౌరు తిరుపతి రెడ్డి గారు, సాయిశ్రీ దంతూరి పండరినాద్ గారు,  మొదలయిన పెద్దవారి రచనలు చదవడము జరిగినది. ఆ తరువాత నా మిత్రులు కస్తూరి లీలా మోహన్ రెడ్డి గారితో కలసి ఎక్కువగా వాస్తు శాస్త్రము గురించి చర్చించుకునే వాళ్ళము. ఇప్పుడు ఏ సందేహము ఉన్నా మా గురువుగారు శ్రీ వెదనపర్తి. సుబ్బరామి రెడ్డి గారు (పుల్లా రెడ్డి గారు, గునపాడు.) గారిని అడిగి నివృత్తి చేసుకుంటూ ఉంటాను. అలా నా వాస్తు శాస్త్ర పరిజ్ఞానము కొంత వరకు పెంచుకోవడము జరిగినది.
                        అది ఇప్పుడు మీ ముందు ఉంచుటకు సాహసిస్తున్నాను....  

1 కామెంట్‌:

  1. రామరాయ వాస్తు శాస్త్రం పుస్తకం కోసం ఎక్కడ వెతికినా దొరకలేదు. అది సాధించే మార్గం ఏంటి ? అది కాకుండా next Best book enti ?

    రిప్లయితొలగించండి